ఉద్యోగ, గెజిటెడ్, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాల ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించారు.
టీజీఈ జెఎసి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో, ఉద్యోగుల దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. పే రివిజన్ కమిషన్ (పిఆర్ సి) నివేదికను తెప్పించి, జూన్ 2 లోపు అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు కోరారు.
రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని, దీంతో పెండింగ్ బిల్లుల బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయని నాయకులు తెలిపారు. ఏక మొత్తంలో పెండింగ్ లో ఉన్న రూ. 13,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి, పెన్షనర్లను, వారి కుటుంబాలను ఇబ్బందులు పడకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని, మే 1వ తేదీ నుండి వారికి వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) ను రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్ (ఓపిఎస్) ను పునరుద్ధరించాలని వారు కోరారు.
ప్రధాన నాలుగు సమస్యలతో పాటు, దీర్ఘకాలికంగా ఉన్న 64 అంశాలలో పెండింగ్ లో ఉన్న వాటిని సత్వరమే పరిష్కరించాలని సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు.











