మిర్యాలగూడ మునిసిపాలిటీ నూతన కమీషనర్‌గా నర్రా శ్రీజరెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా, బదిలీపై వెళ్తున్న ప్రస్తుత కమీషనర్ జి. శ్రీనివాస్ ఆమెకు ఛార్జ్ అప్పగించారు.
గ్రూప్ వన్ అధికారిణి అయిన నర్రా శ్రీజరెడ్డి, తన తొలి నియామకంలో భాగంగా మిర్యాలగూడ మునిసిపాలిటీ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించడం విశేషం. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం ఆమె స్వస్థలం.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం, శ్రీజరెడ్డికి మునిసిపాలిటీ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. మేనేజర్, రెవిన్యూ ఆఫీసర్ జి. జ్ఞానేశ్వరి, డిఇఇ వెంకన్న, టిపిఎస్ అంజయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక ప్రజల సహకారంతో మిర్యాలగూడను ఒక ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని నూతన కమీషనర్ శ్రీజరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. పట్టణాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.










