సమాజంలో మహిళల రక్షణలో పురుషుల పాత్ర కీలకమని, వారే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలబడాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 'స్టాండ్ విత్ హర్' క్యాంపెయిన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, మహిళల భద్రతను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్‌లో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 'స్టాండ్ విత్ హర్' క్యాంపెయిన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా Stand With Her క్యాంపెయిన్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వాన్ని కాపాడడంలో పురుషులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం తెలియజేస్తుందని ఆయన అన్నారు.
ఆడపిల్లలను ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు చూస్తూ ఊరుకోకుండా ప్రశ్నించే తత్వాన్ని యువత అలవర్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. వేధింపులను చూసి చూడనట్టు ఉండటం కూడా నేరానికి సహకరించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. సొంత కుటుంబ సభ్యులకు ఏదైనా కష్టం వస్తే ఎలా స్పందిస్తామో, అదేవిధంగా ఇతర మహిళల విషయంలోనూ ఆలోచించాలన్నారు.
మహిళల భద్రతతో పాటు వారి ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీలేని రుణాలు మహిళల పేరుమీద ఇస్తున్నామని, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, ఆర్టీసీ బస్సుల నిర్వహణలోనూ వారిని భాగస్వాములను చేస్తున్నామని వివరించారు. తెలంగాణ గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించేలా అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు.
గతంలో భౌతిక వేధింపులు ఎక్కువగా ఉండేవని, కానీ ఇప్పుడు ఆన్లైన్ క్రైమ్, డీప్ ఫేక్ వీడియోల వంటివి పెరిగిపోయాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని పటిష్టం చేశామని తెలిపారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధితులనే నిందించే సంప్రదాయాన్ని వీడాలని, ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు 'స్టాండ్ విత్ హర్' నినాదంతో అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.


