రానున్న గోదావరి నది పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించి చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పుణ్యస్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి సౌకర్యాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఘాట్ల వద్ద భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, రహదారుల మరమ్మత్తులు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు.
వివిధ శాఖల అధికారులు తమ తమ పరిధిలో చేపట్టాల్సిన పనులపై సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డిపిఓ శ్రీనివాస్, డిఎంహెచ్వో రాజేందర్, వివిధ ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


