రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో విఫలమైన ప్రజాప్రతినిధులు మౌనం వహించడం సిగ్గుచేటని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పీసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శించారు.
రాజమండ్రిలో పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చట్టసభల్లో ప్రత్యేక హోదా అంశంపై ప్రశ్నించని ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే వీధి శునకాలు మిన్న అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్, ఆత్మగౌరవాన్ని రాజకీయ అవసరాలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిసినా నాయకులు మౌనం పాటించడం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడంలో వారి వైఫల్యాన్ని సూచిస్తుందని అన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని మీడియా గుర్తించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
కార్పొరేట్ మీడియా కూడా ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలను పక్కన పెట్టి అమరావతి వంటి విషయాలపై మాత్రమే వార్తలు ప్రసారం చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడని ఎంపీలను భవిష్యత్తులో ప్రజలు తిరస్కరించే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలని మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సమావేశానికి పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించగా, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












