చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే కీలక బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు లోక్సభలో ఆమోదం పొందడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. అవసరమైన మెజారిటీ సాధించలేకపోవడంతో బిల్లు వీగిపోయింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. చట్టసవరణకు అవసరమైన మూడింట రెండొంతల మెజారిటీ (352 ఓట్లు) సాధించడంలో ప్రభుత్వం విఫలమైంది.
బిల్లు వీగిపోవడంతో, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు- 2026లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో లోక్సభ నియోజకవర్గాలను 543 నుంచి 850కి పెంచాలనే ప్రతిపాదన నిలిచిపోయింది.
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి సభకు హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. లోక్సభలో 537 మంది సభ్యులు ఉండగా, 360 సీట్లు అవసరం. అధికార ఎన్డీఏకు 293 సీట్లు మాత్రమే ఉన్నాయి. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతూ, బిల్లును మార్పులతో సభలో ప్రవేశపెడితే మద్దతు ఇస్తారా అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనలను ప్రభుత్వం తోసిపుచ్చింది.








