కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, ఇందుకోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. హరిత పిలుపునిచ్చారు. శనివారం భైంసా మండలం వానల్పాడ్ గ్రామంలో 140వ మే డే పోస్టర్‌ను ఆమె విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎం. హరిత మాట్లాడుతూ, ఐరోపాలో జరిగిన పారిశ్రామిక విప్లవం అనంతరం ఆధునిక కార్మిక వర్గం ఉద్భవించిందని తెలిపారు. యాంత్రికరణ పెరుగుదలతో పోటీ పడలేకపోయిన కార్మికులు పనిగంటలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేపట్టారని గుర్తుచేశారు.
1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని దినం కోసం కార్మికులు నిరసనలు చేపట్టగా, పెట్టుబడిదారుల ప్రేరణతో పోలీసులు కాల్పులు జరిపి కార్మికులను హతమార్చారని ఆమె చెప్పారు. తిరుగుబాటు నాయకులను ఉరితీయడం, జైలు శిక్షలు విధించడం వంటి అణచివేత చర్యలు చోటుచేసుకున్నాయని వివరించారు. ఈ బలిదానాల వల్లే మే డే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్మికులను బానిసలుగా మార్చే విధంగా చట్టాలు రూపొందిస్తున్నదని ఆమె విమర్శించారు. కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, 140వ మే డేను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాజేశ్వర్, నరేందర్, భారతి, లక్ష్మి, శ్యామల, వనిత తదితరులు పాల్గొన్నారు.












