నిర్మల్, 2026-08-31
రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను అవమానించేలా వ్యవహరిస్తోందని డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్‌రెడ్డి ఆరోపించారు. హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై జరిగిన సంఘటన కుల అహంకారానికి నిదర్శనమని ఆయన అన్నారు.
రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను అవమానించేలా వ్యవహరిస్తోందని డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్‌రెడ్డి ఆరోపించారు. నిర్మల్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై బీజేపీ-ఆర్ఎస్ఎస్ వర్గాలు శుద్ధీకరణ పేరుతో వ్యవహరించడం కుల అహంకారానికి నిదర్శనమని సతీష్‌రెడ్డి అన్నారు. ఈ ఘటన ఖర్గేపై జరిగిన చర్య మాత్రమే కాదని, దేశంలోని దళితులు, బడుగు, బలహీన వర్గాలను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనను ప్రశ్నించి, న్యాయం కోసం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరిన కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. దోషులపై చర్యలు తీసుకోకుండా న్యాయం కోరిన వారిపై కేసులు పెట్టడం బీజేపీ రాజకీయ కుట్రలకు నిదర్శనమని ఆయన ఆరోపించారు.
పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం సరికాదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీని కేసులు, జైళ్లతో భయపెట్టాలని చూస్తే అది బీజేపీ భ్రమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎప్పటికీ వెనుకడుగు వేయదని ఆయన స్పష్టం చేశారు.
హల్ద్వానీలో శుద్ధీకరణ పేరుతో దళితులను అవమానించిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి దేశ ప్రజలకు, మల్లికార్జున్ ఖర్గేకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.
దేశంలో కుల వివక్షకు చోటు లేదని, దానిని ప్రోత్సహించే రాజకీయాలకు కూడా ప్రజలు తగిన సమాధానం ఇస్తారని సతీష్‌రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, సామాజిక న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలతో కాంగ్రెస్ నాయకులను భయపెట్టలేరని బీజేపీపై విమర్శలు చేశారు.












