యోగా ద్వారా ఆత్మవిశ్వాసం, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని యోగా శిక్షకురాలు తనశ్రీ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యోగా శిక్షణలో ఉపాధ్యాయులుగా వైసీ 3 గ్రేడ్ వన్ శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ స్వీకరించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
తనశ్రీ యోగా ప్రయోజనాలను వివరిస్తూ, నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాల మహిళలకు ఆన్లైన్ ద్వారా యోగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. యోగా అనేది శరీరాన్ని, మనస్సును, ఆత్మను అనుసంధానించే ప్రక్రియ అని, దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.
యోగాసనాలు, ప్రాణాయామం వల్ల శరీర దృఢత్వం, కండరాల వశ్యత, రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తెలిపారు. శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్లి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు.
మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి ధ్యానం, శ్వాసక్రియలు తోడ్పడతాయని, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని అన్నారు. నిద్రలేమి సమస్యలకు యోగా ఒక పరిష్కారమని, నాణ్యమైన నిద్రకు ఇది దోహదపడుతుందని తెలిపారు.
సూర్య నమస్కారాలు, ఇతర యోగా ప్రక్రియల ద్వారా శరీరంలోని అదనపు కొవ్వు కరిగి, బరువు అదుపులో ఉంటుందని, ప్రాణాయామం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుందని తనశ్రీ వివరించారు. క్రమశిక్షణతో కూడిన యోగా అభ్యాసం వల్ల సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆమె సూచించారు.












