విశాఖపట్నం గ్రామీణం, 2026-08-16
విశాఖ ప్రజల తాగునీటి అవసరాలు, డేటా సెంటర్లకు నీటి కేటాయింపులపై రాష్ర్ట జలవనరుల శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు సరైన సమాచారం ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు.
విశాఖ ప్రజల తాగునీటి అవసరాలు, రాబోయే సంవత్సరాలకు ఎంత నీరు అవసరం డేటా సెంటర్లకు ఎంత కావాలి అన్న అంశంపై రాష్ర్ట జలవనరుల శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు సరైన సమాచారం అందించలేదని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి, మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ పేర్కొన్నారు.
ఆ లేఖలోని వివరాలను ఆయన శనివారం మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం విశాఖ ప్రాంతంలో స్థానిక రిజర్వాయర్లు, ఏలేరు కాలువ నుంచి వచ్చేది 9.6 టిఎంసిలు మాత్రమేనని, అందులో సుమారు 40-50 శాతం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వెళ్తుందని తెలిపారు.
ఇతర పరిశ్రమలకు నీటి తరలింపు
హెచ్‌పీసీఎల్ రిఫైనరీ, రెండు పోర్టులు, రెండు పవర్ ప్లాంట్లకు, ఫార్మా కంపెనీలకు ఏలేరు నుంచి నీళ్లు తరలించబడుతున్నాయని గుర్తుచేశారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు కూడా నీరు ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిందని, ఇలా నీరు తరలిపోతే విశాఖ ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నీటి అవసరాలపై అంచనాలు
విశాఖ నగరానికి రోజుకు 5.16 టిఎంసిలు అవసరమని, 2047 నాటికి ఏడాదికి 9.37 టిఎంసిలు అవసరం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
డేటా సెంటర్లకు అధిక కేటాయింపుపై అభ్యంతరం
డేటా సెంటర్లకు ప్రభుత్వం ఈ రోజు విశాఖ ప్రజలకు కావాల్సిన నీటిలో 68 శాతం వరకు తరలించనున్నట్టు అర్థమవుతోందన్నారు. ఇది ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు.












