న్యూఢిల్లీ, 2026-08-22
మత ప్రస్తావనలతో కూడిన వందేమాతరం పూర్తి నిడివి గేయాన్ని రాజకీయ అస్త్రంగా చేసుకోవడానికి బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలో, వందేమాతరం విషయంలో కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, పూర్తి గేయాన్ని ఆలపించాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
మత ప్రస్తావనలతో కూడిన వందేమాతరం పూర్తి నిడివి గేయాన్ని రాజకీయ అస్త్రంగా చేసుకోవడానికి బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. మత ప్రస్తావనలున్న భాగాలను మినహాయించి దేశమంతటా వందేమాతరం గేయాన్ని ఆలపించడం సాధారణంగా ఉన్నప్పటికీ, దీనికి మత ప్రస్తావనలు కూడా జత చేసి పూర్తి నిడివి గేయాన్ని ఆలపించాలన్నది బీజేపీ వాదన. ఇటీవల సంస్థాగత మార్పుల నేపథ్యంలో కొత్త నాయకత్వంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన ఆ పార్టీ నూతన పదాధికారుల సమావేశం శనివారం జరిగింది.
కాంగ్రెస్‌పై ఆరోపణలు
ఈ సమావేశంలో వందేమాతరం విషయంలో కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. వందేమాతరం గేయంలోని కేవలం రెండు చరణాలను మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, పూర్తి గేయాన్ని ఆలపించాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
భారీ ప్రచారానికి ప్రకటన
వందేమాతరం ఘనమైన వారసత్వాన్ని దేశం నలుమూలలా వ్యాప్తి చేయడానికి భారీ ప్రచారాన్ని కూడా చేపట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ తీర్మానానికి సంబంధించిన వివరాలను నితిన్ నబీన్ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
గాంధీజీ ప్రకటనను ప్రజల్లోకి
వందేమాతరాన్ని స్వచ్ఛమైన జాతీయ భావానికి, సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదంగా అభివర్ణించిన మహాత్మా గాంధీ ప్రకటనను పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఆరు చరణాలతో కూడిన సంపూర్ణ జాతీయ గేయాన్ని, వందేమాతరంతో ముడిపడిన దేశ స్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలను యువత అర్థం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఆయన తన ప్రకటనలో తెలిపారు.











