గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఇటీవల ప్రవేశపెట్టిన ఫోటో నమోదు నిబంధనలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది. పనికి వెళ్ళిన ప్రతి రోజు, ప్రతి దశలో ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలనే నిబంధన కారణంగా, కూలీలు పని కంటే ఫోటో తీయడంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని వాపోతున్నారు.
ఉదయం పని ప్రారంభించే ముందు, పనులు పూర్తయిన తర్వాత రెండుసార్లు ఫోటోలు తీయాలని అధికారులు సూచిస్తున్నారని కూలీలు తెలిపారు. అయితే, అనేక గ్రామాల్లో నెట్వర్క్ సమస్యల కారణంగా ఫోటోలను వెంటనే అప్లోడ్ చేయడం కష్టంగా మారుతోందని, దీంతో పని పూర్తయిన తర్వాత కూడా గంటల తరబడి ఫోన్లతోనే గడపాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు.
మరోవైపు, క్షేత్రస్థాయి సిబ్బందిలో చాలా మంది వద్ద అత్యాధునిక స్మార్ట్ఫోన్లు లేకపోవడం కూడా ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తోందని సమాచారం. ఫీల్డ్ అసిస్టెంట్లకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కొత్త మొబైల్స్ కొనుగోలు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
“మాకు పని చేసి కష్టపడటం తెలుసు. మా పనిని నమ్మి వేతనం ఇవ్వాలి కానీ ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదు” అని కూలీలు తమ వేదనను వ్యక్తం చేశారు. ఈ కొత్త నిబంధనలు వారి దైనందిన పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో, అధికారులు ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఫోటో నమోదు నిబంధనలను సడలించాలని లేదా ప్రత్యామ్నాయ విధానాన్ని అమలు చేయాలని కూలీలు కోరుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.








