హైదరాబాద్, 20 July
జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతడికి ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతడికి ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
కర్నాటకకు చెందిన 30 ఏళ్ల వివాహిత ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెకు అసభ్యకర సందేశాలు పంపుతూ వేధించడంతో పాటు, ఆమెను గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులిమి, మెడపై కత్తిపెట్టి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. బాధితురాలి వ్యక్తిగత వీడియోను రికార్డు చేసి ఆమె భర్తకు పంపుతూ బ్లాక్మెయిల్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు తీవ్రమైన సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, నేషనల్ పోలీస్ అకాడమీ (NPA) ప్రివిలేజ్ కమిటీ సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించి, ఆరోపణలు నిజమని నిర్ధారించడంతో ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. పోలీసులు నోటీసులు జారీ చేయగా, తనకు ఎలాంటి తప్పు లేదని ఉదయ్ కృష్ణారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ ప్రస్థానం కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఆదర్శంగా నిలిచింది. సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్.. తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ కూలిపనులు చేసి తెచ్చే డబ్బుతోనే జీవనం సాగించాడు. ఆ కసితోనే 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అయితే, ఒక సీఐ తోటివారి ముందు అవమానించడంతో 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి, సివిల్స్ బరిలోకి దిగాడు. నాలుగుసార్లు విజయం దక్కకపోయినా.. పట్టుదలతో ఐదోసారి 360 ర్యాంకుతో ఐపీఎస్ సాధించాడు. త్వరలో పూర్తి స్థాయి పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టాల్సిన అతను.. ఇప్పుడు ఆరోపణలతో ఆత్మహత్యాయత్నం చేసుకునే స్థాయికి వచ్చాడు.











