తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 6 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది.
వివిధ శాఖల నుంచి అందిన ఖాళీల వివరాలను సమీక్షించేందుకు టీజీపీఎస్సీ పాలక మండలి త్వరలోనే సమావేశం కానుంది. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం దాదాపు 6 వేలకు పైగా పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1,000కి పైగా, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 300కు పైగా అధ్యాపక పోస్టులున్నాయి.
అలాగే డైట్ (డీఐఈటీ) కాలేజీల్లో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో 100కి పైగా అధ్యాపక ఖాళీలున్నాయని సమాచారం. వీటితో పాటు జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులు, వ్యాయామ ఉపాధ్యాయుల (పీఈటీ) ఖాళీలు కూడా ఉన్నాయి.
దేవాదాయ శాఖ, అటవీ శాఖ, సర్వే సెటిల్మెంట్, టీజీ ఆర్టీసీ, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కూడా పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయని అధికారులు తెలిపారు. నిరుద్యోగులు ఒకేసారి అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని ఆందోళన చెందకుండా ఉండేందుకు, ప్రతి రెండు వారాలకోసారి ఒక నోటిఫికేషన్ చొప్పున విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది.
అలాగే ఒకే తేదీలో రెండు ఉద్యోగ నియామక పరీక్షలు రాకుండా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లు పెంచి, 44 ఏళ్లకు చేర్చింది. రాబోయే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే వారంతా తప్పనిసరిగా టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌ను అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.












