బోధన్, 2026-08-19
బోధన్ ప్రాంతానికి చెందిన ఓ దివ్యాంగురాలు తన భర్త విడుదలకు రూ.84 లక్షల బ్లడ్‌మనీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కన్నీటితో వేడుకుంటోంది. సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదం కేసులో జైలు పాలైన భర్తను విడిపించుకోవడానికి ఆమె ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మానవతావాదుల సహాయం కోరుతోంది.
నా భర్తను ఎలాగైనా విడిపించండి.. రూ.84 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటూ బోధన్ ప్రాంతానికి చెందిన ఓ దివ్యాంగురాలు కన్నీటితో వేడుకుంటోంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త సౌదీ అరేబియాలోని రియాద్‌లో జైలు పాలై రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పుడు అతని విడుదలకు భారీ మొత్తంలో బ్లడ్‌మనీ (రక్తపరిహారం) చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
రోడ్డు ప్రమాదంతో జీవితం తలకిందులు
బోధన్ ప్రాంతానికి చెందిన శ్రావణ్‌కుమార్ ఉపాధి కోసం సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లాడు. అక్కడ అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అక్కడి పోలీసులు శ్రావణ్‌కుమార్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
కోర్టు ఆదేశించిన భారీ పరిహారం
తాజా నివేదికల ప్రకారం, ఈ కేసులో అక్కడి న్యాయస్థానం శ్రావణ్‌కుమార్‌కు బాధిత కుటుంబానికి 3.30 లక్షల సౌదీ రియాళ్లను, భారత కరెన్సీలో సుమారు రూ.84 లక్షల బ్లడ్‌మనీ చెల్లించాలని ఆదేశించింది. బాధిత కుటుంబం అంగీకరించి పరిహారం చెల్లిస్తేనే శ్రావణ్‌కుమార్ విడుదలకు అవకాశం ఉంటుందని న్యాయస్థానం పేర్కొన్నట్లు తెలిసింది.
చంటి బిడ్డతో భార్య ఆవేదన
భర్త జైల్లో ఉండటంతో అతని భార్య దిక్కుతోచని స్థితిలో ఉంది. తాను దివ్యాంగురాలినని, చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితిలో ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. చంటి బిడ్డను చూసుకుంటూనే భర్త కోసం గడపగడపకు తిరుగుతూ సహాయం కోరుతోంది.
ప్రభుత్వాల సహాయం కోసం విజ్ఞప్తి
నా భర్తను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలి. మాకు ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మానవతావాదులు స్పందించి ఆదుకోవాలి అంటూ ఆమె వేడుకుంటోంది. రెండేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న భర్తను విడిపించేందుకు రూ.84 లక్షల బ్లడ్‌మనీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని అవసరమైన సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం
పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు అనుకోని రోడ్డు ప్రమాదం కారణంగా జైలుపాలవడం.. అతని కుటుంబం ఇప్పుడు భారీ మొత్తంలో పరిహారం సమకూర్చుకోవాల్సిన పరిస్థితి రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ బాధ పగోడికి కూడా రావొద్దు.. నా భర్తను నాకు తిరిగి అప్పగించండి అంటూ భార్య చేస్తున్న వేడుకోలు అందరినీ కలచివేస్తోంది.












