Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ)ను సందర్శించారు. ప్రాజెక్టులోని నీటిమట్టం, వరద ప్రవాహం, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో చర్చించి, నీటి విడుదలపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలిపారు.
రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ)ని సందర్శించి అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టులోని నీటిమట్టం, వరద ప్రవాహం, ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్ఆర్ఎస్పీ తెలంగాణకు గర్వకారణమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ప్రాజెక్టులో పూడికతీత చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. అలాగే, ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామని వెల్లడించారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించిన ఆయన, ఆ మూడు బ్యారేజీల పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, దానిపైనా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన డ్యామ్‌లు 60 ఏళ్లైనా పటిష్ఠంగా నిలిచి ఉన్నాయని, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కొన్ని ప్రాజెక్టులు మాత్రం దెబ్బతిన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.












