West Godavari/Attili (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
షాబాద్‌ను వణికించిన సామూహిక హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతిచెందాడు. కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ సమీపంలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మూడు రోజులుగా తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్న సమయంలో నిందితుడు మృతదేహంగా కనిపించడం సంచలనంగా మారింది.
షాబాద్‌ను వణికించిన సామూహిక హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతిచెందాడు. కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ సమీపంలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మూడు రోజులుగా తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్న సమయంలో నిందితుడు మృతదేహంగా కనిపించడం సంచలనంగా మారింది.
స్థానికులు పెంజర్ల సమీపంలోని ఓ వెంచర్ వద్ద వ్యక్తి మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అది పరారీలో ఉన్న రాజ్‌కుమార్ మృతదేహమేనని నిర్ధారించారు. మృతదేహం పక్కనే విషం బాటిల్ లభ్యమవడంతో అతడు విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
జూలై 10 అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తనపై నమోదైన పోక్సో కేసుపై తీవ్ర ఆగ్రహంతో రాజ్‌కుమార్ ప్రతీకార దాడికి దిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ముందుగా షాబాద్ పట్టణంలో పోక్సో కేసుకు సంబంధించిన మైనర్ బాలిక తల్లి, నాయనమ్మపై దాడి చేసి వారిని హత్య చేశాడు. అనంతరం ఆ మైనర్ బాలికను అఖిల్ సాగర్ చెరువు ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుకోసి చంపాడు. అక్కడితో ఆగకుండా తన ఇంటికి వెళ్లిన రాజ్‌కుమార్, భార్యతో పాటు తన ఇద్దరు పిల్లలను కూడా అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఇలా మూడు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం ఆరుగురిని హత్య చేసి పరారయ్యాడు. ఒకే రాత్రిలో జరిగిన ఈ వరుస హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుడిని పట్టుకునేందుకు మొత్తం 12 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. తెలంగాణతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. రాజ్‌కుమార్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటు అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, సెల్‌ఫోన్ వివరాల ఆధారంగా పోలీసులు అతడి కదలికలను గుర్తించే ప్రయత్నం చేశారు.
హత్యలు చేసిన అనంతరం రాజ్‌కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి "నేను కూడా చనిపోతున్నా" అని చెప్పినట్లు సమాచారం. అనంతరం తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో అతడి కోసం పోలీసులు మరింత ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అయితే చివరకు అతడు తన మేనమామ ఊరైన కొత్తూరు మండలం పెంజర్లలో మృతదేహంగా కనిపించడం కేసులో కీలక మలుపుగా మారింది.












