‘‘ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 11
రంగారెడ్డి జిల్లా షాబాద్ సమీపంలోని దైవాలగూడలో ఓ వ్యక్తి పోక్సో కేసులో బెయిల్‌పై బయట తిరుగుతూ, తనపై కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నిందితుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు, బాలిక, ఆమె తల్లి, నాయనమ్మలను కత్తితో నరికి చంపాడు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ సమీపంలోని దైవాలగూడలో ఓ ఉన్మాది ఆరుగురిని అతి కిరాతకంగా చంపేశాడు. పోక్సో కేసులో బెయిల్‌పై బయట తిరుగుతున్న నిందితుడు రాజ్‌కుమార్, తనపై కేసు పెట్టారన్న కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ ఏకంగా ఆరుగురిని హతమార్చాడు. భార్య, ఇద్దరు మగ బిడ్డలతో పాటు, తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి, నాయనమ్మలను కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపాడు.
మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని తనపై కేసు పెట్టారని కక్షతో షాబాద్‌లోని బాలిక ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో చంపేందుకు యత్నించాడు. అడ్డొచ్చిన బాలిక తల్లి లక్ష్మీ, అమ్మమ్మ రుక్కమ్మను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని తన స్వగ్రామం దైవాలగూడలోని అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి, అక్కడ గొంతుకోసి చంపేశాడు.
అంతటితో ఆగకుండా కొద్ది దూరంలోనే ఉన్న ఇంటికి వెళ్లి భార్య సరిత, ఇద్దరు పిల్లలు పరీక్షిత్ (4), దైవీక్షిత్ (2) లను కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. హత్య చేసిన అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, 'నేనే ఆరుగురిని చంపాను. నేను కూడా చనిపోతున్నాను' అని చెప్పాడు. దీంతో నిందితుడు రాజ్‌కుమార్ తండ్రి అరుణ్‌కుమార్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హత్యల సమాచారం అందుకున్న సీపీ తరుణ్ జోషి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం ఆరు హత్యలు జరిగినట్లు గుర్తించామని సీపీ తరుణ్ జోషి పేర్కొన్నారు. రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలి ఇంట్లోకి నిందితుడు ప్రవేశించినట్లు తెలిసిందన్నారు. బాధితురాలి తల్లి, నానమ్మను కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం బాలికను చెరువు వద్దకు తీసుకెళ్లి హత్య చేసినట్లు వెల్లడించారు. నిందితుడు ఇంటికి వెళ్లి తన భార్య, ఇద్దరు చిన్నారులను కూడా హత్య చేశాడని సీపీ తెలిపారు. హత్యల అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి 'ఆరుగురిని చంపాను - నేను కూడా చనిపోతున్నా' అని సమాచారం ఇచ్చాడన్నారు.
హత్య అనంతరం నిందితుడు రాజ్ కుమార్ పరారయ్యాడు. నిందితుడి కోసం 7 బృందాలు గాలిస్తున్నాయి. రాజ్ కుమార్ తన భార్య, పిల్లల్ని చంపడం దిగ్భ్రాంతికి గురి చేసిందని సీపీ తరుణ్ జోషి తెలిపారు. అర్ధరాత్రి షాబాద్ వెళ్లి బాలిక తల్లి, నాన్నమ్మను కత్తితో పొడిచి చంపాడు. బాలికను షాబాద్ నుంచి బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లాడు. దైవాలగూడ సమీపంలోని చెరువు వద్ద బాలికను కూడా చంపేశాడు. పోక్సో కేసు నమోదు అయినప్పుడు నిందితుడు పరారయ్యాడు. తర్వాత అరెస్ట్ చేయగా, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని విడుదల అయ్యాడని సీపీ తరుణ్ జోషీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు సీపీ తెలిపారు. బాలికను వేధించాడని ఆమె తల్లి మే 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది. రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై తిరిగొచ్చిన నిందితుడు శనివారం తెల్లవారుజామున ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు రాజ్‌కుమార్ ఏడేళ్ల క్రితం భార్య సరితను ప్రేమించి పెళ్లి చేసుకోవడం గమనార్హం.











