ఘజియాబాద్, అయోధ్య, ఉత్తరప్రదేశ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన నిధుల చోరీని బహిర్గతం చేసిన విలేకరి అభిషేక్ ఉపాధ్యాయ, తన వ్యక్తిగత భద్రత, గోప్యతకు రక్షణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరుతో తన డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ అడిగి వేధిస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన నిధుల చోరీ (చందాల చోరీ) విషయాన్ని బట్టబయలు చేసిన విలేకరి అభిషేక్ ఉపాధ్యాయ, తన వ్యక్తిగత భద్రతకు, గోప్యతకు రక్షణ కల్పించాలంటూ ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన విషయంలో దర్యాప్తు పేరుతో ఘజియాబాద్ పోలీసులు, అభిషేక్ ఉపాధ్యాయ ఎక్కడెక్కడ తిరిగారో దానికి సంబంధించిన డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ అందజేయాలని అంతర్జాల వేదిక ఎక్స్‌ను కోరడంతో తన వ్యక్తిగత భద్రతకు, గోప్యతకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఉందని అభిషేక్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టుకు నివేదించారు.
ఎక్స్ ప్రధాన కార్యాలయానికి పోలీసుల లేఖ
ఈ కేసులో అభిషేక్ ఉపాధ్యాయ తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది అనూప్ పీ అవస్తి, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు తన వాదన వినిపిస్తూ, ఘజియాబాద్ పోలీసులు పై వివరాలు తెలియజేయాలని కోరుతూ కాలిఫోర్నియాలోని ఎక్స్ ప్రధాన కార్యాలయానికి విజ్ఞప్తి పంపించారని తెలియజేశారు. అది ఒక నిర్దిష్ట తేదీనాటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా వివరాలు కావాలని ఘజియాబాద్ పోలీసులు కోరారు. ఆ నిర్దిష్ట తేదీ నుంచి అభిషేక్ ఉపాధ్యాయ ఎక్కడెక్కడ తిరిగారో వివరాలు తెలియజేస్తే రామ మందిర్ చందా చోరీ సమాచారం ఎవరి నుండి ఆయనకు వచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంటుందని కూడా ఘజియాబాద్ పోలీసులు ఎక్స్‌కు రాసిన లేఖలో అభిప్రాయపడినట్లు న్యాయవాది అనూప్ పీ అవస్తి న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
కేసుకు, దర్యాప్తుకు పొంతన లేదు
ఈ లేఖలో వెల్లడించినట్లు, అభిషేక్ ఉపాధ్యాయ ఆ నిర్దిష్ట తేదీన ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే, పోలీసులు మాత్రం జూన్ ఒకటో తేదీ నుంచి ఆయన ఎక్కడెక్కడ తిరిగారో ఆ సమాచారాన్ని అందజేయాలని కోరటం గమనించాల్సిన విషయం. ఆ నిర్దిష్ట తేదీన జరిగే సంఘటనకు, జూన్ ఒకటో తారీకు నుంచి ఆయన ఎక్కడెక్కడ తిరిగారో అన్న సమాచారానికి మధ్య ఎటువంటి సంబంధం ఉందన్న విషయాన్ని మాత్రం ఘజియాబాద్ పోలీసులు వెల్లడించలేదని ఉపాధ్యాయ తన పిటిషన్లో పేర్కొన్నారు.
సదరు ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో అభిషేక్ ఉపాధ్యాయకు పోలీసుల నుండి రక్షణ కల్పిస్తూ ఆ నిర్దిష్ట తేదీన ఆదేశాలు జారీ చేశామని, తాజా పిటిషన్‌పై త్వరలో విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది.












