తెలంగాణలో రైతు భరోసా పథకం కింద నిధుల విడుదల రేపటి నుంచి ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో దాదాపు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
యాసంగి, సీజన్ ప్రారంభం నుంచి పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఈ ప్రకటన ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లాలోని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులు వ్యవసాయ సాగు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా, రేపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఈ నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా, రైతులకు సకాలంలో సహాయం అందేలా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం నిధులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు.
నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే నగదు జమ కానుంది. తొలి విడతలో భాగంగా ఒక ఎకరం వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లోకి ఈ నెల 22న రూ.3,590 కోట్లు చేరనున్నాయి. ఈ విడత పూర్తయిన 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేస్తారు. రెండో దశలో సుమారు రూ.2,650 కోట్లను పంపిణీ చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏప్రిల్ నెలాఖరు నాటికి మూడో విడత నిధులను కూడా విడుదల చేసి, ఈ సీజన్ రైతు భరోసా ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది. మొత్తంగా మూడు విడతల్లో కలిపి సుమారు రూ.9,000 కోట్లు రైతుల చేతికి అందనున్నాయి. గతంలో నిధుల విడుదల ఆలస్యమవడంతో రైతులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఏప్రిల్ లోపే పంపిణీ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.











