నేరడిగొండ మండలం పెద్దబుగ్గారం గ్రామానికి చెందిన ఎస్సీ యువకుడు నాతరి సతీష్ (23) హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు నమోదైన 48 గంటల్లోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ తెలిపారు.
జూన్ 17న సతీష్ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నేరడిగొండ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం జూన్ 19న కరాత్వాడ చెరువులో సతీష్ మృతదేహం లభ్యమవడంతో కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తేలింది. ప్రధాన నిందితుడు షేక్ సుమేర్ తన ప్రేమకు సతీష్ అడ్డుగా ఉన్నాడనే కక్షతో స్నేహితుల సహాయంతో హత్యకు పాల్పడినట్లు ఏఎస్పీ వెల్లడించారు. నిందితులు మద్యం పార్టీ పేరుతో సతీష్‌ను కరాత్వాడ చెరువు వద్దకు పిలిపించి, మద్యం తాగించిన అనంతరం హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడవేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మృతుడి ద్విచక్ర వాహనాన్ని ఆదిలాబాద్‌కు తరలించి, మొబైల్ ఫోన్‌ను రైలులో పడవేసినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యేక బృందాల సహకారంతో కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి 5 మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన 2 ద్విచక్ర వాహనాలు, మృతుడి ద్విచక్ర వాహనం, సంఘటన స్థలంలో లభించిన 7 ఖాళీ బీరు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిసి నేరానికి పాల్పడినందున భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ (దౌర్జన్యాల నిరోధక) చట్టం సెక్షన్ 3(2)(v) కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.












