ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని చెప్పి, మాట తప్పడం ప్రభుత్వానికి సరికాదని ఎస్టీయూ టియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ టియస్ నిరంతరం కృషి చేస్తోందని, విద్యా కమిషన్ సిఫార్సుల్లో కొన్ని లోపాలు ఉన్నాయని, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి నెలకు 700 కోట్ల స్థానంలో 1500 కోట్లు విడుదల చేయాలని గజేందర్ డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
బీహార్ తరహాలో టెట్ పరీక్ష కనీస అర్హత మార్కులను తగ్గించుటకు ముఖ్యమంత్రి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలం వేతనం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులపై జీవో జారీ చేయాలని, మోడల్, గురుకుల, ఎయిడెడ్, కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం కల్పించాలని కోరారు.
పెన్షనర్ల సమస్యలపై వచ్చే నెలలో రాష్ట్ర స్థాయిలో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు ఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు.








