యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్, యాష్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ పోచంపాడ్ జల విద్యుత్ కేంద్రంలో ఉద్యోగుల ఆందోళన నాలుగో రోజుకు చేరుకుంది.
టీజీపీఈజేఏసీ (TGPEJAC) నాయకుల ఆధ్వర్యంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కె. సతీష్, ఎం.డి. రఫీక్, దేవరాజ్, ఎం. ప్రవీణ్, చంద్రశేఖర్, నరేష్, శృతిమ, రాంబాబు, స్వాతి, ఏ.వి. శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
నాయకులు మాట్లాడుతూ, జెన్కో ఉద్యోగులకు మద్దతుగా ట్రాన్స్కో, డిస్కం ఉద్యోగులు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటీకరణ నిర్ణయం అమలైతే ఉద్యోగుల భద్రత, హక్కులు దెబ్బతినడంతో పాటు విద్యుత్ సంస్థల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. టెండర్ ప్రక్రియను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పోచంపాడ్ జల విద్యుత్ కేంద్ర ఉద్యోగులు, టీజీపీఈజేఏసీ నాయకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










