నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, వితంతు మహిళల గౌరవాన్ని పెంచేందుకు, అభివృద్ధి పనుల్లో వారిని భాగస్వామ్యం చేసేందుకు మున్సిపాలిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా మహిళా కౌన్సిలర్లు, సిబ్బందిని సన్మానించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ అప్పాల కావ్య గణేష్ మాట్లాడుతూ, మహిళల గౌరవాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వితంతు మహిళలను అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
రాజకీయాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ రంగం, సామాజిక సేవా కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం కీలకమని ఆమె పేర్కొన్నారు. రాజకీయ భాగస్వామ్యం కేవలం ఓటు హక్కుకే పరిమితం కాకూడదని, అన్ని రంగాల్లో మహిళలు చురుగ్గా పాల్గొనాలని ఆమె సూచించారు.
పిల్లల విద్యపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యావంతులు అయితేనే ఉన్నత స్థాయికి ఎదగగలరని ఛైర్మెన్ వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మేనేజర్ మారుతి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ హరీష్‌తో పాటు పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


