నిర్మల్, 30 July
నిర్మల్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. భైంసా డివిజన్లో రోడ్లపై చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలమట్టం కావడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా భైంసా డివిజన్లో పరిస్థితి దారుణంగా మారింది.
భైంసా మండలం మహాగం–గుండెగాం గ్రామాల మధ్య భారీ వృక్షం రోడ్డుపై కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా, కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రోడ్డుపై పడిన వృక్షాన్ని గమనించిన మహాగం గ్రామ లైన్మన్ శేఖర్, స్వచ్ఛందంగా చెట్టు కట్టింగ్ మిషన్తో అక్కడికి చేరుకొని, చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని, నేలకొరిగిన విద్యుత్ స్తంభాల మరమ్మతులు చేపట్టి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు. లైన్మన్ శేఖర్ సేవలను స్థానికులు అభినందించారు.












