నర్సీపట్నం, 2026-08-16
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పరిధిలో పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రిట్టవానిపాలెం గ్రామం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, 7.48 కిలోల గంజాయి బయటపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా నర్సీపట్నం మండలం గబ్బాడ పంచాయతీ పరిధిలోని రిట్టవానిపాలెం గ్రామం వెళ్లే రహదారి వద్ద 7.48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి. రాజారావు సిబ్బందితో కలిసి నిఘా ఏర్పాటు చేశారు.
పారిపోయేందుకు యత్నించగా పట్టుకున్న పోలీసులు
ఈ క్రమంలో సీతకండి గ్రామం వైపు నుంచి రిట్టవానిపాలెం మీదుగా నర్సీపట్నం వైపు ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వస్తుండగా పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి వారు వాహనాన్ని తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించగా సిబ్బంది వారిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న నీలం రంగు కళాశాల సంచిని తనిఖీ చేయగా 7.48 కిలోల గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి కొనుగోలు చేసిన తీరు
విచారణలో నిందితులు గోకవరం మండలం గంగంపాలెం గ్రామానికి చెందిన నక్కరాజు లోవరాజు, కాండ్రేగుల సూర్యప్రకాష్గా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరు ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై కత్తిపూడి నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి, పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా గంజాయిని కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. అనంతరం గంజాయిని సంచిలో పెట్టుకుని నర్సీపట్నం మీదుగా తుని జాతీయ రహదారి వైపు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారని పేర్కొన్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
పోలీసులు నిందితుల నుంచి 7.48 కిలోల గంజాయితో పాటు రెండు ఆండ్రాయిడ్ సెల్ఫోన్లు, ఏపీ 05 సీడీ 2171 నంబరు గల హోండా గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు
అరెస్టయిన వారిలో నక్కరాజు లోవరాజు (30), తాపీ మేస్త్రీ, గంగంపాలెం గ్రామం, గోకవరం మండలం, కాండ్రేగుల సూర్యప్రకాశ్ (24), టీ దుకాణం నిర్వాహకుడు, గంగంపాలెం గ్రామం, గోకవరం మండలం ఉన్నారు.
పోలీసుల హెచ్చరిక
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.











