మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో "స్వశోధన్ ట్రస్ట్" ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, విద్యార్థుల విరాళాలతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవాలు పాఠశాలలోని విద్యా, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
శ్రీ సరస్వతీ విద్యాపీఠం విభాగ్ పూర్వ అధ్యక్షులు డా. దామోదర్ రెడ్డి కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించగా, పాఠశాల సమితి అధ్యక్షులు రవీంద్రనాథ్ పాండే ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయబడిందని, ఇది వారి డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడానికి దోహదపడుతుందని తెలిపారు.
పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ విరాళాలతో ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇది అందరికీ పరిశుభ్రమైన తాగునీటిని అందించడంలో సహాయపడుతుందని రవీంద్రనాథ్ పాండే పేర్కొన్నారు. ఈ సౌకర్యాల కల్పనలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందని ఆయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమాలలో జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, పాఠశాల సమితి ఉపాధ్యక్షులు ముత్యాల కిషన్, పాఠశాల అధ్యక్షులు కొండావార్ సంజీవ్, కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్, సహ కార్యదర్శి దర్భార్ నవీన్, కోశాధికారి కోలేకర్ శంకర్, సభ్యులు కంది మానాజీ, కంది దత్తాత్రి, జిందంవార్ వెంకటేష్, పూర్వ విద్యార్థులు బండారి శ్రీకాంత్, దర్భార్ నరేష్, ధర్మపురి రజనీష్, బాస్కరొల్ల శేఖర్, ప్రధానాచార్యులు సారథి రాజు, అకాడమిక్ ఇంచార్జి స్వప్న శర్మతో పాటు పలువురు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.












