బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 18
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను మంగళవారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కలిసి, నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని, అలాగే బాసరలో బంజారా సంఘానికి ఒక ఎకరం స్థలం కేటాయించాలని విన్నవించారు. మంత్రి ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను మంగళవారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కలిసి పలు సమస్యలను విన్నవించారు. హమ్ పథకంలో మంజూరైన రోడ్ల పనులు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆయన మంత్రిని కోరారు.
రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై వినతి
నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయని, గత ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇకనైనా రోడ్ల నిర్మాణాలు చేపట్టి రవాణా మార్గాన్ని మెరుగుపరచాల్సిందిగా కోరారు. కొన్నిచోట్ల డబుల్ లైన్ రోడ్లు వేయాల్సిందిగా వినతి పత్రంలో పేర్కొన్నారు. నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిపై, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధిపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది.
బాసరలో బంజారా సంఘానికి స్థలం కేటాయింపు
అదేవిధంగా, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో బంజారాల కోసం ఒక ఎకరం స్థలాన్ని కేటాయించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మంత్రి సీతక్కను కోరారు. దేశ నలుమూలల నుండి గిరిజనులు బాసరకు వస్తారని, వారి సౌకర్యార్థం సేవాలాల్ మహారాజ్ సంఘ భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
మంత్రి సానుకూల స్పందన
ఈ వినతికి మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఆయన వెంట నాయకులు సాంవ్లీ రమేష్ తో పాటు పలువురు ఉన్నారు.

