మిర్యాలగూడ పట్టణంలోని వార్డులను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) పిలుపునిచ్చారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక వార్డు సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, మిర్యాలగూడ పట్టణంలోని 29వ వార్డు బంగారుగడ్డ, 3వ వార్డు తాళ్ళగడ్డలలో పర్యావరణ వారోత్సవాల ప్రత్యేక వార్డు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బిఎల్ఆర్, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో వార్డులు, గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వార్డులలోని ఖాళీ స్థలాల్లో, రోడ్ల పక్కన పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రజలను కోరారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వార్డు పరిధిలోని డ్రైనేజీల పూడికతీత పనులను, నీటి నిల్వలు లేకుండా యాంటీ-లార్వా ఆపరేషన్లను తక్షణమే చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీజ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు జావిద్, బంటు పద్మ లక్ష్మీనారాయణ, వార్డు అధికారులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.











