నిర్మల్, జూన్ 27
డాక్టర్ కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుంట ఆరాధ్య 12వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కుంట రమనేశ్వర్–స్రవంతి దంపతులు పేద విద్యార్థులకు సుమారు రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. గత ఐదేళ్లుగా తమ కుమార్తె జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ, విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు.
డాక్టర్ కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక కావేరి కుటీర్‌లో కుంట ఆరాధ్య 12వ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కుంట రమనేశ్వర్–స్రవంతి దంపతులు పలువురు పేద విద్యార్థులకు సుమారు రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.
గత ఐదేళ్లుగా ప్రతి సంవత్సరం తమ కుమార్తె ఆరాధ్య జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ, పేద విద్యార్థులను గుర్తించి వారి చదువు, కనీస అవసరాల కోసం ఆర్థికంగా చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా అనంతరం కుటుంబ పెద్దలను కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల పిల్లల విద్యాభ్యాసం ఆగిపోకుండా సహాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కావేరి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అప్పాల చక్రధరి మాట్లాడుతూ, డాక్టర్ రమనేశ్వర్ దంపతులు ప్రతి ఏటా పేద విద్యార్థుల చదువు కోసం ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు మాట్లాడుతూ దానశీలత గొప్ప గుణమని, ఇతరులకు సహాయం చేయడం ద్వారా సమాజంలో మంచి మార్పు వస్తుందని అన్నారు. పేద విద్యార్థులు, అనాథ ఆశ్రమాలు, దివ్యాంగుల విద్యాసంస్థలు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు డాక్టర్ రమనేశ్వర్ అందిస్తున్న సహాయం ప్రశంసనీయమని కొనియాడారు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య ఎంతో ముఖ్యమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
ఆర్థిక సహాయం పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డాక్టర్ రమనేశ్వర్–స్రవంతి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం తమ చదువుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కావేరి ఫౌండేషన్ కోశాధికారి అప్పాల శశికళ, మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల అనురాధ మహేష్, పీజీ ప్రధానోపాధ్యాయులు మైస అరవింద్, కుంట భూమన్న, అప్పాల భోజరాజు, అప్పాల మంజుల, మహతి అనాథ ఆశ్రమ నిర్వాహకులు, దివ్యాంగుల పాఠశాల నిర్వాహకులు, డాక్టర్ రమనేశ్వర్ మిత్రబృందం, పోలీస్ భీమేష్, దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












