కుంటాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గౌరవ సర్పంచ్ జక్కుల గజేందర్ అధ్యక్షతన మహిళా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభలో మహిళల గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం, ప్లాస్టిక్ నిర్మూలన వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి.
సభ ప్రారంభంలో, మహనీయురాలు సావిత్రి బాయి ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆమె సేవలను స్మరించుకున్నారు. విద్యా రంగంలో ఆమె చేసిన కృషి, మహిళా సాధికారత, సామాజిక, రాజకీయ రంగాల్లో ఆమె పాత్రను సభ్యులకు వివరించారు.
గ్రామాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం, పంచాయతీలలో వారి ప్రాతినిధ్యం, గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. గ్రామంలో తాగునీటి నిర్వహణను పర్యవేక్షించేందుకు గ్రామీణ వాటర్ & శానిటేషన్ కమిటీ (VWSC)ని ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు.
ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని తీర్మానించారు. ఈ తీర్మానాన్ని సభలో ప్రకటించారు.
కార్యక్రమం చివరలో, ఉప సర్పంచ్ పండ్ల కృష్ణ, మహిళా వార్డు సభ్యులు, ఆశావర్కర్లు, వి.ఓ.ఎ. సభ్యులు పాల్గొని మహిళా సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ, ఏపీఎం, వి.ఓ.య. సిబ్బందితో పాటు మహిళా సంఘాల సభ్యులు కూడా పాల్గొన్నారు.


