కుబీర్ మండలం పార్డి (కె) గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విఠల్–రుక్మిణి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు బోస్లె నారాయణరావు పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన బోస్లె నారాయణరావు పాటిల్, శ్రీ విఠల్–రుక్మిణి మందిరంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, శ్రీ పాండురంగస్వామి ఆశీర్వాదాలు అందరికీ కలగాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలోని పండరపురం భువైకుంఠంగా ప్రసిద్ధి గాంచిందని, అనేక సంతుల పుట్టినిల్లు మరియు భక్తి–ముక్తి కేంద్రస్థానంగా నిలిచిందని పేర్కొన్నారు. వారకరి సంప్రదాయం భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి గొప్ప ప్రతీక అని, సంతుల పాదధూళితో మహారాష్ట్ర భూమి పవిత్రమైందని వివరించారు.
శ్రీ విఠలుని భక్తులైన సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారం, సంత్ నామదేవ్, సంత్ ఏక్నాథ్ వంటి మహనీయులు విఠలుని కీర్తిస్తూ వారకరి సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారని గుర్తుచేశారు. ఈ సంస్కృతిలో కులమత భేదాలు లేవని, విఠలుని పాదాల వద్ద అందరూ సమానులనే భావన ప్రతిఫలిస్తుందని తెలిపారు. పాండురంగస్వామి ఆలయం పార్డి (కె) గ్రామంలో నిర్మించబడటం ఎంతో సంతోషకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
గ్రామస్తులు ఆలయ అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆలయ అభివృద్ధి, గ్రామ సమస్యల పరిష్కారానికి తగిన సహకారం అందిస్తానని బోస్లె నారాయణరావు పాటిల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


