నిర్మల్, 21 July
ఖానాపూర్ పట్టణంలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పనులను పునఃప్రారంభించాలని, అలాగే బస్టాండ్ నుంచి గోదావరి నది తీరం వరకు నూతన రోడ్డు మంజూరు చేయాలని కోరుతూ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, కౌన్సిలర్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు సోమవారం వినతి పత్రం సమర్పించారు.
ఖానాపూర్ పట్టణంలో ప్రధాన రహదారి డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పనులను పునఃప్రారంభించాలని కోరుతూ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, కౌన్సిలర్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు సోమవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఖానాపూర్‌లో కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైన రహదారి విస్తరణ, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పనులు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులు కోర్టు నుంచి స్టే తేవడంతో నిలిచిపోయాయని తెలిపారు. దీంతో పనులు వెనుకబడిపోయి, వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులను వెంటనే పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే, బస్టాండ్ నుంచి శ్రీరామ్ నగర్ గోదావరి నది తీరం వరకు నూతన రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు ఇరుకుగా ఉండటంతో, పండుగలు, పుణ్యస్నానాలకు, అంత్యక్రియలకు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో అంబులెన్స్, ఫైరింజన్ వంటి వాహనాలు సకాలంలో చేరుకోలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్ వద్ద ఉన్న సదర్మాట్ కెనాల్‌పై కొత్త బ్రిడ్జి నిర్మించి, గోదావరి నది తీరం వరకు రోడ్డు వేయించాలని కోరారు. శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు తమ పొలాల్లోంచి రోడ్డు వేయడానికి స్థలాలను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొప్పరపు సత్యవతి, ప్రకాష్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.












