ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్ కోటలో 12-14వ శతాబ్దాల కాలం నాటి అరుదైన చతుర్భుజి సరస్వతి శిల్పం వెలుగులోకి వచ్చింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఈ చారిత్రాత్మక ఆవిష్కరణ చేసింది.
కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ కౌలాస్ కోటను సందర్శించినప్పుడు శివాలయం సమీపంలో ఈ విగ్రహాన్ని గుర్తించారు. ఆయన ఫోటోలను బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ కు పంపగా, ఆయన అది కాకతీయ శైలి సరస్వతి విగ్రహమని నిర్ధారించారు.
శ్రీరామోజు హరగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిల్పం కీర్తి ముఖతోరణంతో, చతుర్భుజి సరస్వతిగా ఉంది. సరస్వతి పరహస్తాలలో అంకుశం, పాశాలను ధరించి ఉండగా, కుడి చేయి విరిగిపోయింది. ఎడమ చేతిలో పుస్తకం, అర్థ పద్మాసనంలో ఉన్న ఈ శిల్పం హంస వాహనంపై చెక్కబడి ఉంది.
ఈ శిల్పం 12-14వ శతాబ్దాల మధ్యకాలానికి చెందినదిగా భావిస్తున్నారు. ఇది ఆ కాలం నాటి కళా నైపుణ్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి చారిత్రక సంపదను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను కంకణాల రాజేశ్వర్ గుర్తు చేశారు.












