హైదరాబాద్, ఆగస్టు 04
హైదరాబాద్ నగరంలో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై ఫుడ్ యాంటీ స్పెషల్ టీం ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కల్తీ మసాలాలు, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై ఫుడ్ యాంటీ స్పెషల్ టీం ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. నగరంలోని 13 మసాలా వ్యాపార సంస్థలలో ఈ తనిఖీలు జరిగాయి.
స్థానికుల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు వంటి అనేక రకాల మసాలాల్లో కల్తీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
మసాలాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం టాల్కమ్ పౌడర్, హానికర రసాయనాలు, ఇండస్ట్రియల్ డైలు, ఫ్యాబ్రిక్ కలర్స్, సింథటిక్ రంగులను ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. నాసిరకం ఉత్పత్తులకు రంగులు అద్ది, నాణ్యమైన మసాలాలుగా మార్కెట్లో విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో సుమారు 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలు, అలాగే తయారీకి ఉపయోగించే 89 టన్నులకు పైగా ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 3 కేసులు నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో ప్రధానంగా ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను తదుపరి విచారణ నిమిత్తం ల్యాబ్ పరీక్షలకు పంపించినట్లు పేర్కొన్నారు.












