వరంగల్, 2026-06-05
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ హక్కుల సాధనకు రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని గౌడ జన హక్కుల పోరాట సమితిమోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్ తెలిపారు. వరంగల్‌లో జరిగిన మోకుదెబ్బ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ మేరకు పిలుపునిచ్చారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ హక్కుల సాధనకు రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని గౌడ జన హక్కుల పోరాట సమితిమోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్ తెలిపారు. వరంగల్ పోచమ్మ మైదాన్‌లోని వరంగల్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన మోకుదెబ్బ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గీత కార్మికుల సమస్యలపై డిమాండ్లు
గీత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నర్సా గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న టీసీఎస్, టీఎఫ్టీ లైసెన్సులను అర్హత ఉన్న వారికి 30 రోజుల్లో మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు నిండిన అర్హులైన గీత కార్మికులకు పింఛన్, ప్రమాదాల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, బీమా, కుటుంబ పింఛన్ అందించాలని కోరారు. గాయపడిన కార్మికులకు ఉచిత వైద్యం, వికలాంగ పింఛన్ కల్పించాలని సూచించారు.
వృత్తికి రక్షణ, ఉపాధి అవకాశాలు
కల్లుగీత వృత్తికి ప్రభుత్వ రక్షణ కల్పించాలని, గీత కార్మికులకు ఆధునిక భద్రతా పరికరాలు, క్లైంబింగ్ కిట్లు, ఆరోగ్య బీమా అందించాలని కోరారు. నీరా పరిశ్రమను అభివృద్ధి చేసి గౌడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు తాటి, ఈత వనరులను అభివృద్ధి చేసి ఉత్పత్తులకు మార్కెట్ కల్పించాలని అన్నారు.
మా జనాభామా వాటా నినాదం
మా జనాభామా వాటా నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక వనరులు, నిర్ణయాధికారంలో గౌడలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు న్యాయమైన భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
సంస్థాగత నిర్మాణం బలోపేతం
తెలంగాణలోని 33 జిల్లాల్లో మోకుదెబ్బ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు, మండల, జిల్లా కమిటీల క్రియాశీలతను పెంచాలని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ముందుగా అధికారులకు వినతిపత్రాలు, ప్రజాప్రతినిధులతో చర్చలు, జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించి, పరిష్కారం లభించకపోతే శాంతియుత, ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.
పాపన్న ఆశయాల సాధన లక్ష్యం
పాపన్నకు జై కొట్టడం మాత్రమే కాదు.. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి. స్వాభిమానం కోసం పాపన్న పోరాడారు.. హక్కుల కోసం మోకుదెబ్బ పోరాడుతుంది అని నర్సా గౌడ్ పేర్కొన్నారు.












