పేదల హక్కులను కాలరాస్తున్న జీఓ 17ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 30న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ సంయుక్త కార్యాచరణ సమితి ప్రకటించింది. ఈ మేరకు కరీంనగర్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి కొంకటి శేఖర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం స్థానికులకు గురుకుల టెండర్లలో అవకాశాలు కల్పించి, నిరుద్యోగాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం స్థానికేతరులకు అవకాశాలు కల్పించేలా వ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఈ జీఓ వల్ల స్థానికుల హక్కులకు భంగం వాటిల్లుతుందని, దీనిని అడ్డుకోవడానికి హైదరాబాద్లో ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుండి కనీసం వెయ్యి మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ జన్ను స్వరూప, ఫిఫ్ రాష్ట్ర కార్యదర్శి దుస్సా కుమార్ స్వామి, కరీంనగర్ జిల్లా ఇంచార్జి మేకల రవీందర్, పెద్దపల్లి జిల్లా ఇంచార్జి మోలుమురి శేఖర్, బీసీ సంఘం నాయకులు ఉరుమల్ల విశ్వం, ఆకెనపల్లి శిరీష, స్వేరో జిల్లా అధ్యక్షుడు జెట్టపల్లి అనిల్, కళ్లేపల్లి తిరుపతి, కళ్లేపల్లి అరవింద్, బడుగు నవీన్, ప్రసాద్, రిషి, సదానందం తదితరులు పాల్గొన్నారు.











