జనగణన ప్రక్రియలో భాగమైన హౌస్ లిస్టింగ్ జాబితా తయారీకి జనగణన సిబ్బందికి, ప్రజలంతా సహకరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కోరారు. శుక్రవారం కలెక్టర్ తన నివాసంలో హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జనగణనలో భాగంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. ముందుగా ఆయన ఆన్లైన్లో పూర్తి చేసుకున్న సెల్ఫ్-ఎన్యూమరేషన్ వివరాలను జనగణన సిబ్బందికి తెలియజేశారు.
ఈ సెల్ఫ్-ఎన్యూమరేషన్ వివరాల ఆధారంగా, అధికారులు కలెక్టర్ నివాస గృహానికి సంబంధించిన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో సూపర్వైజర్ బి. రాజేందర్, ఎన్యూమరేటర్లు హిమబిందు, నాగలత తదితరులు పాల్గొన్నారు.
జనగణన అనేది దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రక్రియ అని, ఇందులో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో అవసరమని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలందరూ తమ వివరాలను ఖచ్చితంగా, సకాలంలో అందించడం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించి, హౌస్ లిస్టింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. వారి సహకారం దేశ భవిష్యత్తుకు పునాది వేస్తుందని అన్నారు.











