న్యూఢిల్లీ, 2026-06-05
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరోసారి ఉద్ధృతంగా మారాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 15 రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరోసారి ఉద్ధృతంగా మారాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు సాధారణ జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం కాగా, నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆగస్టు 7న ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్ సహా మొత్తం 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఉత్తరప్రదేశ్, దక్షిణ గంగా మైదానాలపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ పరిస్థితులు నెలకొన్నట్లు ఐఎండీ వెల్లడించింది.
ఢిల్లీలో వాతావరణం
జాతీయ రాజధాని ఢిల్లీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచే మేఘావృతమైన ఆకాశం, ఈదురుగాలులతో నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 33 నుంచి 39 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉదయం గాలిలో తేమ 95 శాతం నమోదవగా, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లో హెచ్చరికలు
ఉత్తరప్రదేశ్‌లో రాబోయే 24 గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ప్రయాగ్‌రాజ్, ఫతేపూర్, మీర్జాపూర్, రాయ్‌బరేలీ, కాన్పూర్, సహారన్పూర్, ముజఫర్‌నగర్, ఎటావా, ఆగ్రా, మీరట్, ఘజియాబాద్, వారణాసి, లక్నో తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. బీహార్‌లోని పాట్నా, గయా, భోజ్‌పూర్, దర్భంగా జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, జార్ఖండ్‌లోని రాంచీ, జంషెడ్పూర్, ధన్‌బాద్ ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
రాజస్థాన్, హిమాచల్, ఉత్తరాఖండ్‌లో ప్రమాదాలు
రాజస్థాన్‌లో ఆగస్టు 7 నుంచి 10 వరకు భరత్పూర్, జైపూర్, కోటా, అజ్మీర్, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, బికానెర్ డివిజన్లలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. షిమ్లా, కుల్లు, మనాలి, కాంగ్రా, మండి, చంబా, డెహ్రాడూన్, హరిద్వార్, రుద్రప్రయాగ్, చమోలి, నైనిటాల్, ఉత్తరకాశీ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












