ఘట్కేసర్, 9 July
పక్కింటి దంపతుల మత మార్పిడి ఒత్తిడి, పెట్టుబడి పేరుతో రూ.20 లక్షలు మోసం చేయడంతో రవికుమార్, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్కేసర్లో చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసుల విచారణలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్, విద్వాన్స్ అనే ఇద్దరు కుమారులతో సంతోషంగా జీవిస్తున్న ఈ కుటుంబాన్ని పక్కింటి వెంకట్, ప్రమీల దంపతులు మతం మార్పిడి పేరుతో వేధించినట్లు సమాచారం.
ఐదు రోజుల క్రితం ఘట్కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రవికుమార్, శిరీష దంపతుల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వారు ఆత్మహత్య చేసుకోవడానికి పక్కింటి దంపతులే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. మతం మార్చుకోవాలని వారు చేసిన ఒత్తిడి, అది కుదరకపోవడంతో పెట్టుబడి పేరుతో రూ.20లక్షలు తీసుకొని రిటర్న్స్ ఇవ్వకపోవడం వంటి కారణాలతోనే రవికుమార్ దంపతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఈ మేరకు రవికుమార్ కొడుకులు సుశాంత్, విద్వాన్స్లతో పాటు శిరీష తల్లిదండ్రులను పోలీసులు విచారించే సమయంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
బియ్యం వ్యాపారం చేసుకుంటూ, సొంత ఇల్లు కొనుక్కొని ఇద్దరు కుమారులతో సంతోషంగా ఉంటున్న కుటుంబంలో పక్కింటి దంపతులు మతం మార్పిడి పేరుతో చిచ్చు పెట్టారు. పక్కింట్లో ఉంటున్న వెంకట్, ప్రమీల కుటుంబంతో రవికుమార్, శిరీషకు మంచి పరిచయం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని వెంకట్, ప్రమీలలు.. రవికుమార్ ఇంటికి వచ్చిన ప్రతీసారి మతం మార్చుకొని ప్రతీ ఆదివారం చర్చికి రావాలని ఒత్తిడి చేసేవారు. మృధు స్వభావి అయిన రవికుమార్.. అప్పుడప్పుడు తన భార్య శిరీషతో కలిసి వెంకట్ మాట కాదనలేక ప్రార్థనకు వెళ్లేవారు. అయినా తమ మతంలోకి రావాలని వెంకట్, ప్రమీల దంపతులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. మారడం తనకు ఇష్టం లేదని శిరీష తెగేసి చెప్పింది. రవికుమార్ మతం మారుదాం అంటూ భార్యకు నచ్చజెప్పేవాడు. ఈ క్రమంలో వారి మధ్య అప్పుడప్పుడు వాగ్వాదం జరిగేది.
మతం మారడం ఇష్టం లేదని గుర్తించిన వెంకట్, ప్రమీల దంపతులు.. మరో పథకం వేశారు. రెడీమిక్స్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని వారిని నమ్మించారు. ఎలాగూ మతం మారలేదు కదా.. కనీసం పెట్టుబడి పెడదామని రవికుమార్ దంపతులు నిర్ణయించుకున్నారు. రెడీమిక్స్ వాహనం కొనుగోలు చేసేంత వరకు వెంకట్, ప్రమీల దంపతులు వారిని వదిలిపెట్టలేదు. వాహనం కొంటే ప్రతి నెలా రూ.20వేలు ఆదాయం ఇంటికి వస్తుందని నమ్మబలికారు. దాంతో రవికుమార్ తన భార్య నగలను తాకట్టుపెట్టి రూ.20 లక్షలతో వాహనం కొని వెంకట్, ప్రమీలకు అప్పగించారు. రూ.20 వేల చొప్పున రెండు మూడు నెలలు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత ఇవ్వడం మానేశారు. దీంతో బ్యాంకులో ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నామని రవికుమార్, శిరీష మదనపడేవారు.
పక్కింటి దంపతులతో గొడవ పెట్టుకోలేక, వారి పైశాచికత్వాన్ని భరించలేక రవికుమార్ దంపతులు సొంతిల్లు ఖాళీ చేసి వేరే చోటుకు మారాలని నిర్ణయించుకున్నారు. సామానులన్నీ మూటలు కట్టి పెట్టారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఆ రోజు సాయంత్రం (జూలై-2న) ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్లారు. ఆత్మహత్యకు ముందు పక్కింటి వెంకట్‌తో సుమారు అరగంట సేపు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసుల విచారణతో తేలింది. ఆ తర్వాత రవికుమార్, శిరీష దంపతులు ఒకరినొకరు హత్తుకొని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వారు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే పక్కింట్లో ఉండే వెంకట్, ప్రమీల దంపతులు ఇంటికి తాళం వేసి పరారయ్యారని పోలీసులు తెలిపారు.












