అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో, రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెముడాల పరశురాములు డిమాండ్ చేశారు.
మిర్యాలగూడలో జగ్జీవన్ రావు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పరశురాములు మాట్లాడుతూ, రాష్ట్రంలో చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు కావడం లేదని విమర్శించారు. దళిత బంధు స్థానంలో ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని ఎందుకు నిలిపివేశారో ప్రభుత్వం వివరించాలని ఆయన కోరారు.
కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని, దీనికోసం సాంస్కృతిక సారధి కళాకారులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో దళితులకు కేటాయింపులను భారీగా తగ్గించిందని, గత ఏడాది రూ. 40 వేల కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ. 17 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని పరశురాములు ఆరోపించారు. కులాంతర వివాహాలకు రక్షణ కల్పించే చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.












