హైదరాబాద్, జులై 28
భారత్ సరిహద్దు సమీపంలో చైనా తన సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. అత్యాధునిక ‘జె-20 మైటీ డ్రాగన్’ స్టెల్త్ యుద్ధ విమానాలను వైమానిక స్థావరాల్లో మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ చివరి వారం, జులై ప్రారంభంలో చైనా రెండు ఎయిర్‌బేస్‌లలో కలిపి దాదాపు 11 జె-20 యుద్ధ విమానాలను మోహరించినట్లు సమాచారం.
భారత్ సరిహద్దు సమీపంలో చైనా తన సైనిక కదలికలను మరోసారి ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. వైమానిక స్థావరంలో అత్యాధునిక ‘జె-20 మైటీ డ్రాగన్’ స్టెల్త్ యుద్ధ విమానాల మోహరింపును చైనా గణనీయంగా పెంచింది. వాంటార్ శాటిలైట్ తీసిన ఫోటోల ప్రకారం ఈ ఏడాది జూన్ చివరి వారం, జులై ప్రారంభంలో చైనా తన రెండు ఎయిర్‌బేస్‌లలో కలిపి దాదాపు 11 జె-20 యుద్ధ విమానాలను మోహరించినట్లు స్పష్టమవుతోంది.
జులై 9న ఉపగ్రహాలు తీసిన ఫోటోల ప్రకారం.. షింజియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ ప్రాంతంలోని రక్షణ, పౌర రవాణాకు ఉపయోగపడే హోతాన్ ఎయిర్‌బేస్ రన్‌వేపై ఏడు జె-20 విమానాలు నిలిపి ఉంచారు. ఈ స్థావరం లేహ్‌కు ఈశాన్యంగా 389 కి.మీ, ఉత్తర లడఖ్‌లోని భారత వాయుసేనకు చెందిన దౌలత్ బేగ్ ఓల్డీ రన్‌వేకు ఈశాన్యంగా కేవలం 245 కి.మీ దూరంలో ఉంది. మీడియా సేకరించిన ఉపగ్రహ ఫోటోల ప్రకారం.. ఓ చైనా ఎయిర్‌బేస్‌లో ఇంత పెద్ద సంఖ్యలో జె-20 విమానాలు కనిపించడం ఇదే మొదటిసారి.
ఈ నివేదికలోని రెండో ఫోటో ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు వాయువ్యంగా 344 కి.మీ. దూరంలోని టిబెట్‌లోని లాసా పరిధిలో ఉన్న దమ్షుంగ్ ఎయిర్‌బేస్‌లో నాలుగు జె-20 విమానాలు కనిపించాయి. హోతాన్లో ఏడు, దమ్షుంగ్లో నాలుగు జె-20 విమానాలను చైనా మోహరించడంతో, భారత్‌కు సమీపంలో ఉన్న ఎత్తైన ప్రదేశాల్లోని స్థావరాల నుంచి 5జీ యుద్ధ విమాన కార్యకలాపాలు నిర్వహించడం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాయుసేనకు నిత్యకృత్యంగా మారింది. ఇది కేవలం సంకేతాలు ఇవ్వడానికి పరిమితం కాదని స్పష్టమవుతోంది.












