న్యూఢిల్లీ, 2026-08-14
స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా, రాబోయే జనగణనలో కుల వివరాలను కూడా నమోదు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర కులాల వివరాలను అధికారికంగా నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో, వచ్చే ఏడాది చేపట్టనున్న జనాభా లెక్కింపు ప్రక్రియలో భాగంగా గణనకర్తలు అడగాల్సిన 40 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసింది.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా, రాబోయే జనగణనలో కుల వివరాలను కూడా నమోదు చేయనున్నారు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) మినహా ఇతర కులాల వివరాలను అధికారికంగా నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో, వచ్చే ఏడాది చేపట్టనున్న జనాభా లెక్కింపు ప్రక్రియలో భాగంగా గణనకర్తలు (ఎన్యూమరేటర్లు) అడగాల్సిన 40 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసింది. జనగణన షెడ్యూల్లోని 10వ నెంబరు ప్రశ్న ఎదురుగా ఎస్సీ/ఎస్టీ/కులం అని పేర్కొన్నారు. ఈ ప్రశ్న ఓపెన్ కాలమ్‌లో ఉండటంతో, ప్రజలు తెలిపిన కులాన్ని ఎన్యూమరేటర్లు నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జనగణనకు ముందస్తు పరీక్ష లేదా రిహార్సల్స్‌గా జులై 1 నుండి 20వ తేదీ వరకు 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు. ఆ సమయంలో నివాసస్తులు ప్రకటించిన కులాన్నే ఆ కాలమ్‌లో ఎన్యూమరేటర్లు నమోదు చేశారు. తుది గణనలో కూడా ఇదే పద్ధతిని కొనసాగించే అవకాశం ఉంది.
ప్రశ్నావళి నోటిఫికేషన్
జనగణన 2027 సందర్భంగా జనాభా లెక్కల అధికారులు ప్రజలను అడిగేందుకు అనుమతించిన ప్రశ్నల జాబితాను రిజిస్ట్రార్ జనరల్, సెన్సన్ కమిషనర్ ఆఫ్ ఇండియా (ఆర్జి అండ్ సిసిఐ) మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ నోటిఫై చేశారు. ఆధార్ నెంబర్లు, మొబైల్ నెంబర్లు, ఓటర్ ఐడి కార్డులు, బ్యాంక్ ఖాతాలు, అందుబాటులో వుండే కోవిడ్ వ్యాక్సినేషన్ సమాచారం వంటి వివరాలను చేర్చడానికి వీలుగా డేటా సేకరణ పరిధిని విస్తరించారు.
గణన షెడ్యూల్
లడఖ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లోని మంచు కురిసే ప్రాంతాల్లో ఆగస్టు 17న జనగణన రెండో దశ చేపట్టబోతున్నారు. ఆ నేపథ్యంలో కేంద్రం ఈ ప్రశ్నల జాబితాను నోటిఫై చేసింది. ఈ ప్రాంతాలు కాకుండా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనగణన చేపడతారు. జనాభా చట్టం, 1948 కింద కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌తో తమకు అప్పగించిన ప్రాంతాల్లో ప్రతి వ్యక్తి నుండి సమాచారాన్ని సేకరించాల్సిన బాధ్యత జనగణన అధికారులదే.
ప్రశ్నావళిలోని ముఖ్యాంశాలు
నివాసస్తుల నుండి 40 కేటగిరీలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరిస్తారు. పేరు, వయసు, వివాహమైందా లేదా, భార్య లేదా భర్త పేరు, జాతీయత, మతం, కులం లేదా గిరిజన తెగ, తల్లిదండ్రుల సమాచారం వంటి మౌలికమైన వివరాలు ఈ ప్రశ్నావళి జాబితాలో వుంటాయి. విద్యా నైపుణ్యాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా కోరతారు. అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, విద్యా సంస్థల్లో హాజరు, ఉన్నత విద్య సమాచారం కూడా సేకరిస్తారు. భాషకు సంబంధించిన సమాచారం, అంటే మాతృభాష, ఇతర తెలిసిన భాషలు ఏమిటో కూడా రికార్డు చేయాల్సి వుంటుంది. గత సంవత్సరంలో ఏమైనా పనిచేశారా లేదా అని కూడా అడుగుతారు, చేస్తే వారి వృత్తి ఏమిటి, పరిశ్రమలా లేదా సేవా రంగమా, ఏ స్థాయి కార్మికుడు, వారు ఉపాధిని కోరుతున్నారా లేదా వంటి సమాచారం సేకరిస్తారు. ఆరాధనా స్థలాలకు ప్రయాణిస్తే ఆ సమాచారం కూడా సేకరిస్తారు.












