బైంసాలోని బుద్ధ విహార్ లో శుక్రవారం రోజున ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI), S.S.D. ఆధ్వర్యంలో 2570వ త్రిగుణ వైశాఖ బుద్ధ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా BSI బౌద్ధాచార్యులు డాక్టర్ ప్రసంజీత్ హేమ్లే మాట్లాడుతూ, గౌతమ బుద్ధుని చూపిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
బుద్ధ పూర్ణిమ వేడుకల్లో భాగంగా పంచశీల్ ధమ్మ ధ్వజ్ జెండాను ఎగురవేసి, గౌతమ బుద్ధుడు, డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి, పూజలు చేశారు. సమాజ హితం కోసం సర్వసుఖాలను త్యాగం చేసిన మహోన్నతుడు గౌతమ బుద్ధుడని, మానవ వికాసానికి ఆయన హేతుబద్ధమైన జీవన మార్గాన్ని అందించారని డాక్టర్ హేమ్లే కొనియాడారు.
బుద్ధ పూర్ణిమ ప్రాముఖ్యతను వివరిస్తూ, బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుని జననం, జ్ఞానోదయం, మరణాన్ని ఈ పండుగ గుర్తుచేస్తుందని తెలిపారు. సిద్ధార్థుడిగా లుంబినిలో జన్మించిన ఆయన, 29వ ఏట సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించి, 35 ఏళ్ల వయసులో గయ వద్ద బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందారని వివరించారు.
సుమారు 45 ఏళ్ల పాటు పాళి భాషలో బోధనలు చేసిన గౌతమ బుద్ధుడు, సారనాథ్ లో తన మొదటి ఉపన్యాసం ఇచ్చారని, దీనిని ధమ్మచక్ర పవర్తన అంటారని తెలిపారు. క్రీ.పూ. 483 లో కుషినగరలో ఆయన మహాపరినిబ్బన్ పొందారని, పంచశీల, ఆర్య అష్టాంగా మార్గంలో నడిస్తే శాంతియుత జీవనం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
గౌతమ బుద్ధుడు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సామ్రాట్ అశోక చక్రవర్తి వంటి మహాపరుషులను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం ఖీర్, అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బౌద్ధాచార్యులు, ఉపాసిక, ఉపాసకులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.












