భీంగల్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
ప్రముఖ వాగ్దేయకారుడు, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ 65వ జయంతిని భీంగల్ పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, కవి కంకణాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అందెశ్రీ జీవితం, సాహిత్యంపై పలువురు ప్రసంగించారు.
భీంగల్ పట్టణానికి చెందిన కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో ప్రముఖ వాగ్దేయకారుడు, ప్రజాకవి, సహజ కవి, ప్రకృతి కవి, ఉత్తమ గీత రచయిత, నంది అవార్డు గ్రహీత, తెలంగాణ మాతృ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ 65వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అందెశ్రీ చిత్రపటానికి కంకణాల రాజేశ్వర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ అందేశ్రీ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందె ఎల్లమ్మ, బుడ్డయ్య దంపతులకు 1961 జూలై 18న జన్మించారని తెలిపారు.
పశువుల పాలేరు నుండి ప్రజాకవిగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం "జయ జయహే తెలంగాణ, జననీ జయకేతనం" ను రచించారని, తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఎలాంటి విద్యను అభ్యసించకుండా మూడు వేల కవితలు, సినిమా పాటలు రాశారని, కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ చేసిన సేవలను గుర్తించి 2025 జూన్ 25న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అందెశ్రీకి ఒక కోటి రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ ఉపాధ్యక్షుడు తీగల రఘు, డప్పు ప్రశాంత్, నిచ్చేమోల్ల మహేష్, కొండ సాయికిరణ్, గజ్జెల విగ్నేష్ (భరత్), సున్నపు సాయి కుమార్ పాల్గొన్నారు.











