బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 05
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు సోమవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 354 కోట్ల నిధులు కేటాయించడంతో పాటు, హైదరాబాద్కు చెందిన దాత పద్మప్రియ సునంద్ దంపతులు 31 కోట్ల విరాళం అందించడంతో ఈ మహత్తర కార్యం రూపుదిద్దుకుంది. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఈ పనులను ప్రారంభించారు.
ఎన్నో రోజుల కల నెరవేరనున్న వేళ, బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, ఆలయ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రారంభించారు. ఆలయ అధికారులు అమ్మవారి ఆలయ దర్శనాన్ని నిలిపివేసి, పునర్నిర్మాణ పనులను ఈరోజు ప్రారంభించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి 354 కోట్ల నిధులు కేటాయించారు. గర్భగుడి, మండప నిర్మాణానికి హైదరాబాద్కు చెందిన దాత పద్మప్రియ సునంద్ దంపతులు 31 కోట్ల విరాళం అందించడంతో ఆలయ పునర్నిర్మాణానికి అడుగులు పడ్డాయి. దేశంలోనే సుప్రసిద్ధ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం ఈ పునర్నిర్మాణంతో మరింత అభివృద్ధి కానుంది.
ఎన్నో సమస్యల నుండి బాసర అభివృద్ధి జరగాలని, ఆలయ పునర్నిర్మాణం జరగాలని భక్తులు పెద్ద మొత్తంలో కోరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హాయంలోనే ఇది సాధ్యమైందని పలువురు అంటున్నారు. 400 కోట్లతో ఆలయ అభివృద్ధి జరగడం అంటే బాసర ఇక మరింత అభివృద్ధి చెంది ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలగనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ పునర్నిర్మాణ దాత దంపతులను శాలువాతో సత్కరించి, పనులను వారితో ప్రారంభం చేయించారు. తన హాయంలో ఆలయ పునః నిర్మాణం జరగడం అదృష్టంగా భావిస్తున్నానని, ఇది గొప్ప కార్యమని, అమ్మవారి క్షేత్రం నిర్మాణం కావడం ఎంతో పుణ్యఫలమని, నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
తాను శాసనసభ్యునిగా ఎన్నికైనప్పటినుండి ఆలయ అభివృద్ధిపైనే దృష్టి సారించానని, పలుమార్లు శాసనసభలో మాట్లాడడం జరిగిందని, ప్రభుత్వం నిధులు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆలయ పూజారులు, అధికారులను కూడా శాలువాతో సత్కరించారు. మహాకార్యానికి అడుగులు పడడం పట్ల అమ్మవారి అనుగ్రహం ఉందని ఆయన తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఆలయ అభివృద్ధి జరిగితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది, సరస్వతి క్షేత్రం మరింత దేదీప్యమానంగా వెలుగుతుందని ఆయన అన్నారు.











