ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను ఆదివాసి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఆదివాసి కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే రూ.3 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారులో తిరుగుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగమని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ పేర్కొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కొందరు రాజకీయ ప్రత్యర్థులు ఈ అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని నాయక్ ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయనపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని బాణావత్ గోవింద్ నాయక్ హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను గుర్తించాలని, స్వార్థ రాజకీయాల కోసం చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నాయకత్వంలో ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధి యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోలేరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.



