తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా లభిస్తున్న గడ్డి, కలుపు మందులను తక్షణమే నిషేధించాలని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రైతు కమిషన్ బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి ఒక నివేదికను అందజేసింది.
ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో నిషేధించబడిన ఈ ప్రమాదకర రసాయనాలు భారతదేశంలో సులభంగా లభిస్తున్నాయని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. గ్రామీణ, తండా ప్రాంతాల్లోని రైతులు వీటిని తాగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజారోగ్యం దృష్ట్యా ఈ మందులను అరికట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఈ నిషేధాన్ని సమర్థిస్తున్నట్లు నివేదికలో వివరించారు. తెలంగాణలో ఈ మందులను నిషేధించడంతో పాటు, దేశవ్యాప్తంగా వీటిపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున లేఖ రాయాలని ముఖ్యమంత్రిని కోరారు.
రైతు కమిషన్ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి, ప్రాణాంతకమైన ఈ విష రసాయనాలను రాష్ట్రంలో నిషేధించేలా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ చర్యలు ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.








