యువతను పొగాకు ఉత్పత్తుల బారిన పడకుండా కాపాడేందుకు ప్రతి పాఠశాల, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పొగాకు వాడకం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, పొగాకు ఉత్పత్తులను మానేయడానికి అందుబాటులో ఉన్న చికిత్సలను ఉపయోగించుకోవాలని ఆయన సిబ్బందిని, ప్రజలను కోరారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 80 లక్షల మంది, భారతదేశంలో 13 లక్షల మంది పొగాకు వాడకం వల్ల మరణిస్తున్నారని, ఇది నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని డాక్టర్ రాజేందర్ తెలిపారు.
ఆరోగ్యంతో పాటు ఆర్థికంగానూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ అలవాటుకు దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య అధికారులు పాల్గొన్నారు.












