కీసర మండలం రాంపల్లి గ్రామంలోని ఎస్సి కాలనీ అంగన్వాడి పాఠశాల ప్రాంగణంలో కమలానగర్ పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు సీఐటియు కీసర మండల కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 143 మందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
సీఐటియు కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు శిబిరాన్ని ప్రారంభించారు. ఆల్వేస్ హెల్ప్స్ ఫర్ అదర్స్ (AHO) ఫౌండేషన్ తెలంగాణ హైదరాబాద్ టీం అధ్యక్షురాలు మిస్ రజిత నాయక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కూడా నిర్వహించబడిందని, పలువురు యువకులు రక్తదానం చేశారని ఆయన తెలిపారు. వైద్యం ఖరీదైన నేపథ్యంలో పేదల కోసం ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి ఉచిత కాటరాక్ట్ శస్త్రచికిత్సలు కూడా చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
శిబిరంలో కమలానగర్ ప్లానెట్ ఆప్టికల్స్ బృందం కళ్ల పరీక్షలు, దమ్మాయిగూడ సాకేత్-పద్మ సాయి డెంటల్ క్లినిక్స్ బృందం దంత పరీక్షలు నిర్వహించాయి. కమలానగర్ శ్రీకర ఆసుపత్రి వైద్యులు బీపీ, షుగర్, సాధారణ పరీక్షలతో పాటు ఆర్థో, న్యూరో, ఈసీజీ పరీక్షలు చేశారు. నాగారం కుమారి వెల్నెస్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించారు.
మొత్తం 143 మంది ఈ శిబిరంలో పాల్గొని వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ట్రస్ట్ తరఫున రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సీహెచ్ వరప్రసాద్, ట్రస్ట్ నాయకులు, సీఐటియు నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.












